మొగోళ్ళు - మొగుళ్ళు

ఈ మధ్య విశ్వవ్యాప్తంగా భారతీయులు (కొద్దోగొప్పో డబ్బున్న మగాళ్ళు, అదే మొగుళ్ళు) తమతమ భార్యల్ని తెగ ప్రేమించేస్తున్నారుట అని ఎక్కడో ఈ మధ్యనే అంతర్జాలంలో చదివా. అలా ఇలా కాదుట, బంగారంతో.. జ్యోతి గారు చెప్పిన టైపు మొగుళ్ళు కూడానూ ఇందులో ఉండే ఉంటారు! బంగారం దొరకటమే గగన మయ్యేంతగా భార్యల మెళ్ళో కిలోల లెక్కన దింపేస్తున్నారు.. మరి మార్కెట్లో బంగారం షార్టేజ్ అంటే ఆశ్చర్యమేముంది!

చూశారా, రెచ్చిపోతే మొగుళ్ళు ఎలా ప్రేమించేస్తారో, ఉత్తుత్తి ప్రేమతో కాదు,… బంగారు ప్రేమతో.. అందుకే అలా రెచ్చగొట్టకండి జ్యోతి గారూ మా వాళ్ళని, వాళ్ళ ప్రేమని.. :-)

**************************************************************************

మామూలుగానే ఆడవాళ్ళకు షాపింగ్ రెండో మొగుడు కదా. మా శ్రీమతీ అందుకు అతీతమేమీ కాదు. మామూలుగా కొంటునే ఉన్నవి కాక, ఓ రోజు …

ఇవ్వాళ గొప్ప అమ్మకం తగ్గింపు ధరలకు, అన్న పేపర్ చూపించి, వేటకి వెళ్ళటానికి సిద్దమయింది.

ఓ క్షణం అది చూసి నేను విచిత్రంగా నవ్వా!

ఏంటీ మీకేమైనా పిచ్చా లేక వెటకారమా, నే చూపిచ్చిన దాన్లో తప్పు ఏముంది అంది కోపంగా?

తాపీగా, నువ్వే చదువు ఆ కాగితంలో ఏమని రాసాడో అన్నా?

ఏముందీ “మెగా సేల్”  తగ్గింపు అంటున్నాడు అంది..చిర్రు బుర్రుగా..

ఓ మైడియర్, వాడంటున్నది కేవలం నేను “అమ్ముతున్నాను” అని మాత్రమే …

ఆహా, మరయితే మిగతా రోజుల్లో నేను చేసేదేమిటో…?

కొనటమమ్మా కొనటం. అక్కడే ఉంది తిరకాసు, నువ్వు కొనటమూ, వాడు అమ్మటం రెండు వేర్వేరు సంగతులమ్మా అన్నాను. నీకుగా నువ్వెళ్ళి కొంటే, అది వాడికి ఖర్చు పెట్టకుండా జరిగే బిజినెస్సు.అలాంటి పరిస్థితి లేనప్పుడే, నేను “అమ్ముతున్నాను” అంటాడమ్మా !నీకుగా నువ్వెళ్ళి “కొన్నా”, వాడు “అమ్మినా” ఫలితం ఒకటేనే తల్లీ. వదిలేది మన డబ్బే…

అంతే అంటారా? అంది దిగులుగా(వాడిస్తానన్న (దిక్కుమాలిన)తగ్గింపు మిస్సవుతున్నానేమో అన్న బాధతో)?

చివరికి, ఛా ఛా, నన్ను తెగ తికమక పెట్టేశారు, మీకికెప్పుడూ నా షాపింగ్ సంగతులు చెప్పకూడదు అంటూ, నేను కొనడం …. వాడు అమ్మటం …..నేను కొనడం …. వాడు అమ్మటం …నేను కొనడం …. వాడు అమ్మటం ……. అనుకుంటూ ఇంట్లోకి నడిచింది…..

నేను ముసిముసిగా నవ్వుకుంటు విశ్రమించా…

***************************************************************************

మా బంధువులు మా ఇంటి దగ్గర్లోనే ఉంటారు. ఓ రోజు మా స్నేహితుడు, మా ఇంటికి వచ్చి మాటల సందర్భములో..

మీరు బాగా క్లోజ్ కదా అన్నాడు..

అవునవును బాగా.. క్లోజ్ (CLOSE) ఇప్పుడిప్పుడే ఓపెన్ (OPEN) అవుతున్నామురా అన్నా..

వాడికి విషయం అర్థమయ్యిందనే అనుకుంటా..
 

2 స్పందనలు to “మొగోళ్ళు - మొగుళ్ళు”

  1. వైజాసత్య అన్నారు:

    మేము చాలా ఓపెన్ ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నాం ;-) హిహిహి మీ పదాల ఆట బాగుంది.
    మీ బ్లాగులో వ్యాఖ్యరాయలంటే బూతద్దం దగ్గరుండాలండీ

  2. వికటకవి అన్నారు:

    రవి గారు,

    మీరన్నది నిజమే. కానీ సింపుల్గా ఉన్న థీం ఇదే వర్డ్ ప్రెస్సులో. మళ్ళోసారి తిరగేస్తా, ఇంకేమైనా మంచి థీములున్నాయో అని. నెనర్లు.

ప్రత్యుత్తరమిమ్ము